Wednesday 12 August 2020

గంగి గోవు పాలు గంటెడైనను జాలు

గంగి గోవు పాలు గంటెడైనను జాలు
గడివెడైన నేమి ఖరము పాలు?
భక్తి గల్గు కూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ వినురవేమ!

మంచి ఆవు పాలు ఒక గరిట అయినా మంచిదే.దాని వలన ప్రయోజనము వుంటుంది.కానీ గాడిద పాలు కడవ నిండుగా వున్నా వృథానే.ఏమీ ప్రయోజనము ఉండదు.అలాగే ప్రేమగా,ఆదరంగా పెట్టే అన్నము ఒక్క పిడికెడు అయినా తృప్తిగా వుంటుంది.పంచ భక్ష్యపరవాన్నాలు అయినా ఈసడించుకుంటూ,అవమానిస్తూ పెడితే కడుపు నిండదు.మనసుకు తృప్తినివ్వదు.గాడిద పాల లాగా బిందెనిండా ఉన్నా ప్రయోజనము లేకుండా పోతుంది.

Wednesday 5 August 2020

నిక్కమైన నీలమొక్కటి చాలు

నిక్కమైన నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చదువ పద్య మరయ జాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ!
భలే భలే రంగుల గాజురాళ్ళు,వింత వింత కాంతులతో మెరుస్తూ బుట్టెడు వున్నా,ఏమీ ప్రయోజనము లేదు.అవి అన్నీ కలిసినా నల్లగా వుండే ఒక్క నీలం అనే రత్నానికి సాటి రావు.అఛ్చం అలాగే పస లేని,వ్యర్థమైన పద్యాలు కుప్పలు,తెప్పలు ఉన్నా,మంచిగా ఉండే చదువతగిన ఒక పద్యానికి సాటికావు.

Friday 19 June 2020

సకల తీర్థములను సకల యజ్ఞములను

సకల తీర్థములను సకల యజ్ఞంబుల
తలలు గొరిగినంత ఫలము గలదె
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినురవేమ//

సతుల చూడచూడ సంసారి కాగోరు
సుతులు పుట్ట పుట్ట వెతల బడును
గతులు చెడగ చెడగ కర్మమం చేడ్తురు
విశ్వదాభిరామ వినురవేమ //

సుగుణవంతురాలు సుదతియై యుండిన
బుద్ధిమంతు లగుచు పుత్రు లొప్ప
స్వర్గ మేటి కయ్య సంసారి కింకను
విశ్వదాభిరామ వినురవేమ //

హీనగుణము వాని నిలుసేర నిచ్చిన
ఎంత వానికైన నిడుమ గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ వినురవేమ //

హృదయమందు నున్న ఈశుని దెలియక
శిలల కెల్ల మ్రొక్కు జీవులార!
శిలల నేమి యుండు జీవులందే కాక?
విశ్వదాభిరామ వినురవేమ //

హేమనగము చేత నెప్పుడు గలవాడు
వెండి కొండ పైని వెలయువాడు
ఎత్త వలసె బిచ్చ మేమన వచ్చురా
విశ్వదాభిరామ వినురవేమ //

Wednesday 17 June 2020

వెళ్ళి వచ్చువాడు వెళ్ళి పోయెడు వాడు

వెళ్ళి వచ్చు వాడు వెళ్ళి పోయెడు వాడు
తేను లేడు కొంచు పోను లేడు
తానదేడ బోనొ ధనమేడబోవునో
విశ్వదాభిరామ వినురవేమ //

వేదవిద్య లెల్ల వేశ్యల వంటివి
భ్రమల బెట్టి తేట పడగ నీవు
గుప్త విద్య యొకటె కులకాంత వంటిది
విశ్వదాభిరామ వినురవేమ //

వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును
చీడ పురుగు చేరి చెట్టు చెరచు
కుత్సితుండు జేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ //

వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను
మందు దినక కాని మాన దెందు
చెంత దీప మిడక చీకటి వాయునా
విశ్వదాభిరామ వినురవేమ //

వ్రాత వెంట గాని వరమీడు దైవంబు
చేత కొలదిగాని వ్రాతగాదు
వ్రాత కజుడు కర్త చేతకు తాకర్త
విశ్వదాభిరామ వినురవేమ //

శిలను ప్రతిమ జేసి చీకటింటను బెట్టి
మొక్క వలవదికను మూఢులార
ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడీ
విశ్వదాభిరామ వినురవేమ //

Tuesday 16 June 2020

లోభివాని జంప లోకంబు లోపల

లోభివాని జంప లోకంబు లోపల
మందు వలదు వేరు మతము గలదు
పైక మడిగినంత భగ్గున పడిచచ్చు
విశ్వదాభిరామ వినురవేమ //

వద్దనంగ పోదు వలెననగా రాదు
తాను చేసి నట్టి దానఫలము
ఉల్లమందు వగవ కుండుటే  యోగంబు
విశ్వదాభిరామ వినురవేమ //

వాక్కు వలన గలుగు పరమగు మోక్షంబు
వాక్కు వలన గలుగు వరలు ఘనత
వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్
విశ్వదాభిరామ వినురవేమ //

విద్యలేని వాడు విద్వాంసుల కడను
ఉండగానె పండితుండు గాడు
కొలని హంసలకడ కొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ //

విన్నవాని కన్న కన్న వాడధికుండు
కన్నవాని కన్న కలియువాడు
ఉన్నతోన్నతుడయి ఉర్వి లోపల నుండు
విశ్వదాభిరామ వినురవేమ //

వెన్న చేత బట్టి వివరంబు దెలియక
ఘృతము గోరునట్టి యతని భంగి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినురవేమ //

Friday 12 June 2020

మృగమదంబు జూడ మీద నల్లగ నుండు

మృగమదంబు జూడ మీద నల్లగ నుండు
పరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ //

మేడిపండ చూడ మేలిమై యుండును
పొట్ట విప్పి చూడ పురుగు లుండు
పిరికివాని మదిని బింకమీ లాగురా
విశ్వదాభిరామ వినురవేమ //

రాతిబొమ్మ కేల రంగైన వలువలు
గుళ్ళు గోపురములు కుంభములును
కూడు గుడ్డ తాను గోరునా దైవంబు
విశ్వదాభిరామ వినురవేమ//

రామనామ జపముచే మున్ను వాల్మీకి
పాపి బోయడయ్యు బాపడయ్యె
కులము ఘనము గాదు గుణమె ఘనమ్మురా
విశ్వదాభిరామ వినురవేమ //

రాము డొకడు పుట్టి రవికులం బీడేర్చె
కురుపతియును బుట్టి కులము చెరచె
ఎవరి మంచి చెడ్డ లెంచి చూచిన తేట
విశ్వదాభిరామ వినురవేమ //

లోను జూడ జూడ లోకాభిరామంబు
బయలు జూడ జూడ బంధనంబు
తన్ను జూడ జూడ తారక బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ //

Wednesday 10 June 2020

మాయ లోన బుట్టి మాయలోన బెరిగి

మాయ లోన బుట్టి మాయలోన బెరిగి
మాయ దెలియలేని మనుజుడేల
మాయ దెలియువాడు మహి మీద ధన్యుండు
విశ్వదాభిరామ వినురవేమ//

మిరెపుగింజ చూడ మీద నల్లగ నుండు
కొరికి చూడలోన చురుకు మనును
సజ్జను లగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ //

మురికిలోన బుట్టి మురికిలోన బెరిగి
మురికి తనువు కింత మురిపెమేల
మురికెరుంగ నతడు మురికిలో బుట్టునా
విశ్వదాభిరామ వినురవేమ //

ముక్తిగానలేని మూర్ఖజనులకెల్ల
బట్టబయలు జేసి పరమపదము
దారిజూపు ఘనుడు దైవంబు గాదొకో
విశ్వదాభిరామ వినురవేమ //

ముచ్చు యాత్రకేగి ముల్లె విడుచుగాని
మొక్క పొద్దు లేదు మొనసి యెపుడు
కుక్క యిల్లు సొచ్చి కుండలు వెదకదా
విశ్వదాభిరామ వినురవేమ//

మూఢభక్తి చేత ముక్కంటి పూజింప
మొన్న బోయవాడు ముక్తుడాయె
పూజకేమి తనదు బుద్ధి ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ//